‘మోడీ గో బ్యాక్‌’ అంటూ.. ఏపీలో నిరసనలు

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘మోడీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.

ప్రధాని పర్యటించనున్న గుంటూరు నియోజకవర్గంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ ఏపీలో అడుగు పెట్టవద్దని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. మోడీని ప్రజలు స్వాగతించరని తెలుగు యువత నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడ లెనిన్‌ కూడలిలో వామపక్ష నేతలు నిరసనకు దిగారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ రాష్ట్ర పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మోడీ పర్యటనను అడ్డుకుని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. మోడీ పర్యటనను నిరసిస్తూ కడప జిల్లాలో మట్టి, నీళ్ల కుండలతో వామపక్షాలు వినూత్నంగా నిరసన తెలిపాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ, వామపక్షాల నేతలు కలిసి ఆందోళనలు చేపట్టారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి మోడీ పర్యటన పట్ల శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.