గుంటూరు సభలో ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు

‘నా కంటే సీనియర్‌ అని చంద్రబాబు చెప్పుకుంటారు. అవును, కొత్త కూటములు జత కట్టడంలో మీరు సీనియర్‌. ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్‌. ఏపీ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్‌. ఆ విషయంలో నేను ఆయనతో పోటీ పడలేను’ అంటూ ప్రధాని మోడీ సీఎం చంద్రబాబుపై వ్యంగ్య బాణాలను సంధించారు. గుంటూరులో నిర్వహించిన బీజేపీ ప్రజా చైతన్య సభలో మోడీ మాట్లాడారు. ఏ పార్టీ అయితే రాష్ట్రాన్ని మోసం చేసిందో ఆ పార్టీతోనే జట్టు కట్టారంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధుల కంటే ఎక్కువే ఇచ్చామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్ర పథకం హృదయ్‌ కింద అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించామని ప్రధాని మోడీ వెల్లడించారు. తొలుత తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.

‘ఏపీలో రూ.వేల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులను ప్రారంభించాను. ఈ ప్రాజెక్టుల వల్ల దేశం మొత్తానికి చమురు రంగంలో ఏపీకి అగ్ర ప్రాధాన్యం లభిస్తుంది. పెట్రోలియం నిల్వల్లో ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. ప్రాజెక్టుల ద్వారా గ్యాస్‌ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది. ఎల్‌పీజీ, సీఎన్‌జీ గ్యాస్‌ ద్వారా ఎరువుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది. నిన్న అసోంలో గ్యాస్‌ గ్రిడ్‌ను ప్రారంభించా. అన్ని నగరాల్లో గ్యాస్‌ పంపిణీ చేసేందుకు దీనిని‌ అనుసంధానం చేస్తున్నాం. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలను పెట్రోలియం హబ్‌గా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశవ్యాప్తంగా పట్టణాల్లో జరిగే మార్పుల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’ అని మోడీ పిలుపునిచ్చారు.

‘దేశ అభివృద్ధిని దెబ్బతీసిన వారే అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఏపీ వికాసాన్ని మరిచి మోడీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి అయ్యారు. ఏపీలో మౌలిక వసతులను గొప్పగా మారుస్తామన్నారు. అమరావతిని నిర్మిస్తానని చెప్పి.. కూలిన పార్టీని నిర్మించే పనిలో ఉన్నారు. సన్‌రైజ్‌ రాష్ట్రం చేస్తానని చెప్పి.. కుమారుడి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. నా కంటే సీనియర్‌ అంటారు గానీ ఆయనకంటూ చెప్పుకునేందుకు ఏమీ లేదు. సీనియర్‌ నాయకుడైనందుకు మీకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చాను. కొత్త కూటములు జత కట్టడంలో మీరు సీనియర్‌. ఏపీ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్‌. ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్‌. ఆ విషయంలో నేను పోటీ పడలేను. ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే మాత్రం మీతో ఏకీభవించను. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీతో మీరు జట్టు కట్టారు. ఎన్టీఆర్‌.. కాంగ్రెస్‌ విముక్త రాష్ట్రం చేయాలని సంకల్పించారు. వారితోనే మీరు జట్టు కట్టారు. దీన్ని చూస్తుంటే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంటుంది. చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకే ఇక్కడికి వచ్చా. ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు భయపడుతున్నారు. తన కుమారుడిని రాజకీయాల్లో అందలం ఎక్కించాలని చూస్తున్నారు.’

‘కేంద్ర నిధులకు లెక్కలు చెప్పాలంటే చంద్రబాబు వెనుకడుగు వేస్తున్నారు. గతంలో ఆయన కేంద్రం నిధులకు లెక్క చూపేవారు కాదు. ఇక్కడ జరిగిన సభలో చిన్న టెంట్‌ మినహా మిగిలిందంతా పార్టీ సొమ్మే. రేపు ఫొటోలను తీయించుకోవడానికి టీడీపీ నాయకులంతా ఢిల్లీ వెళుతున్నారు. అందుకు ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు. ఇదే వారికీ మనకు ఉన్న వ్యత్యాసం. నన్ను తిట్టడం మానేసి ఎక్కడి నుంచి ఈ సొమ్ము వినియోగిస్తున్నామో ప్రజలకు చెప్పండి. ‘గో బ్యాక్‌’ అని నాకు చెబుతున్నారు. అందుకు ధన్యవాదాలు. మళ్లీ నేను ఢిల్లీలో కూర్చోబోతున్నానని మీరే చెబుతున్నారు’ మోడీ అన్నారు.

‘కాంగ్రెస్‌ స్వలాభాల కోసం రాష్ట్ర విభజన చేసింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విభజన చేయలేదు. 2016 సెప్టెంబర్‌లో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశాం. ప్రత్యేక ప్యాకేజీ అమలుపై సీఎం.. కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పారు. ప్యాకేజీపై శాసనసభలో అభినందిస్తూ తీర్మానం చేశారు. మేం ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశాం. ప్యాకేజీని వినియోగించుకోవడంలో సీఎం విఫలమయ్యారు. రాష్ట్రానికి రూ.3లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులను ఇచ్చాం. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తూ వచ్చాం. ఐఐటీ తిరుపతి, సెంట్రల్‌ వర్సిటీ, ఎయిమ్స్‌ వంటి సంస్థలు ఏపీకి వచ్చాయి. కేంద్ర నిధులతో విశాఖ- చెన్నై కారిడార్‌ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాల విస్తరణ, నిర్మాణ పనులు చేపడుతున్నాం. రాజధాని అమరావతి అనుసంధానానికి వేగంగా పనులు జరుగుతున్నాయి. ఏపీలో చేపట్టిన 8 పెద్ద ప్రాజెక్టుల్లో 6 ప్రాజెక్ట్‌ పనులు మొదలయ్యాయి’ అని మోడీ చెప్పారు.

తన రాకను నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగిరేసిన వారికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. శుభకార్యాలు జరిగినప్పుడు నల్లని దిష్టి చుక్క పెడతారని.. నల్ల బెలూన్ల స్వాగతాన్ని కూడా అలాగే భావిస్తున్నానని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిపై, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి.