చిరంజీవి బయోపిక్‌పై రామ్‌చరణ్‌కు నాగబాబు సలహా..!


ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో రోజుకో బయోపిక్‌ గురించి ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్‌లు తెరపైకి వచ్చినా కొన్ని మాత్రమే సక్సెస్‌ను సాధించాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్‌ గురించి టాపిక్ వచ్చింది. దీనిపై చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్‌పై నాగార్జున, డి.రామానాయుడు బయోపిక్‌పై సురేష్, వెంకటేష్‌లు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి బయోపిక్‌ను రామ్‌చరణ్ నిర్మాతగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నాగబాబు తన అన్న చిరంజీవి బయోపిక్‌పై స్పందించారు.

సినీ కెరీర్‌ ఆరంభంలో అన్నయ్య చిరంజీవి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అంతా సక్సెస్‌ఫుల్‌ జీవితాన్నే గడిపాడు. కానీ సావిత్రి, సిల్క్‌ స్మిత, సంజయ్‌దత్‌ల విషయం వేరు. వారి జీవితాల్లో ఎన్నో ఒడిదొడుకులను చవిచూశారు. కాబట్టి వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది కాబట్టి థియేటర్లకు పరుగులు తీశారు. చిరు జీవితంలో అలాంటివేమీ లేవు. కాబట్టి రామ్‌చరణ్‌ తన తండ్రి బయోపిక్ తీయకపోవడమే ఉత్తమం అనుకుంటున్నా అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇప్పటికే ఎందరో దిగ్గజాల బయోపిక్‌లు వెండితెరపై దర్శనమిచ్చాయి. దాంతో మెగాస్టార్‌ అభిమానులు సైతం చిరంజీవి బయోపిక్‌ కూడా వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ అవసరం లేదని నాగబాబు అంటున్నారు కాబట్టి చిరు బయోపిక్‌ వచ్చే అవకాశాలు లేవని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి “సైరా నరసింహారెడ్డి” చిత్రంలో నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.