భగవతిదేవిని దర్శించుకున్న నయనతార


స్టార హీరోయిన్‌ నయనతార.. ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌తో కలిసి ఆ మధ్య అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపులకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. ఇటీవల తిరుమలకు వెళ్లి దేవదేవుడిని దర్శించుకున్నారు. తాజాగా కన్యాకుమారిలోని ప్రసిద్ధి చెందిన భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ మూక్కుత్తి అమ్మన్‌గా దర్శనం ఇచ్చే అమ్మవారు చాలా మహిమ కలిగిన దేవతగా ప్రతీతి. కాగా నటి నయనతార త్వరలో మూక్కుత్తి అమ్మన్‌ అనే భక్తి రస కథా చిత్రంలో అమ్మవారిగా నటించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే కన్నాకుమారిలో ప్రారంభమైంది. అయితే నయనతార ఆ సమయంలో విదేశాల్లో ఉండడంతో ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనలేకపోయారని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన నయనతార తన ప్రియుడితో కలిసి సోమవారం కన్యాకుమారికి వెళ్లి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భగవతి ఆలయాన్ని సందర్శించి మూక్కూత్తి అమ్మన్‌ను దర్శించుకున్నారు.

అమ్మవారి ముందు సుమారు అరగంట పాటు కూర్చుని ప్రార్థించుకున్నారు. అనంతరం గుడి చుట్టూ ప్రదర్శనం చేశారు. కాగా ఇది శబరిమలకు వెళ్లే సీజన్‌ కాబట్టి మూక్కుత్తి అమ్మన్‌ అలయం అయ్యప్ప భక్తులతో కళకళలాడుతోంది. కాగా నయనతార అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులకు నమస్కరించారు. నయనతార గుడికి వచ్చిన విషయం ఆ ప్రాంతం అంతా వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రాంతాలను నుంచి ప్రజలు ఆమెను చూడడానికి పోటెత్తారు.దీంతో ఆ ప్రాంతంలో తోపులాట జరిగింది. అయితే నయనతార ఆలయానికి రానుండడంతో దేవాలయ నిర్వాహకులు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కొందరు మహాళా పోలీసులు నయనతారకు రక్షణగా నిలిచారు. వారి సాయంతో నయనతార క్షేమంగా అక్కడ నుంచి బయట పడ్డారు. కాగా మహిళా పోలీసులు నయనతారతో ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపడంతో ఆమె వారితో సెల్ఫీలు దిగి సంతోష పరిచారు. కాగా నయనతార త్వరలో కన్యాకుమారిలో జరుగుతున్న మూక్కుత్తి అమ్మన్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కాలం అంతా నయనతార శాఖాహారిగా మారి నియమాలను పాఠించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.