‘అర్జున్‌ సురవరం’ టీజర్‌

యంగ్‌ హీరో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అర్జున్‌ సురవరం’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ ఎల్‌ పి పతాకంపై రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. అంతేకాకుండా ‘అర్జున్‌ సురవరంతో’ నిఖిల్‌ ఖాతాలో మరో విజయం పడటం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను కొద్ది సేపటి క్రితమే మూవీ యూనిట్‌ విడుదల చేసింది.

ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్న నిఖిల్‌.. నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసే ఓ ముఠా గుట్టురట్టు చేసినట్లు కనిపిస్తోంది. దీంతో అతడు ఎదుర్కొనే సమస్యలు, కోల్పోయే ప్రేమ, మర్యాద, ప్రత్యర్థులపై తీసుకునే రివేంజ్‌ ఇలా అన్ని కలగలిపి సినిమాకు సంబంధించి ప్రధాన అంశాలను ట్రైలర్‌ రూపంలో చూపించారు. అర్జున్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి అంటూ బ్యాగ్రౌండ్‌లో వచ్చే డిమాండ్‌తో ట్రైలర్‌ ప్రారంభమై అందరిలోనూ ఆసక్తి రేకిత్తిస్తోంది. ‘ఈ కోపం నువ్వు నిజం చెప్పనందుకు కాదు.. నువ్వే నిజం కానందుకు, ఒక బాధితుడిలా కాదు.. ఒక రిపోర్టర్‌లా ఆలోచించాలి, వాడికి కావాల్సింది ఎవిడెన్స్‌.. తప్పకుండా వెతుక్కుంటూ వస్తాడు, ప్రతీ ఒక్క స్టూడెంట్‌కు ఇచ్చే మెసేజ్‌ ఇదే.. ఇది మన ప్రాబ్లమ్‌ మనమే సాల్వ్‌ చేసుకోవాలి’ అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

కథను ట్రైలర్‌లోనే రివీల్‌ చేసిన దర్శకుడు.. పెద్ద భారాన్ని తగ్గించుకున్నాడు. ఇక ట్రైలర్‌ విడుదల సందర్బంగా ‘ఈ సినిమాకు పడిన కష్టాలు ఇప్పటివరకు చేసిన నా 17 చిత్రాలకు పడలేదు. నిజాయితీగా మీ దగ్గరికి తీసుకరావాలన్న ప్రయత్నమే అర్జున్‌ సురవరం చిత్రం. ఆశీర్వదించండి’ అంటూ నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిషోర్, తరుణ్‌ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సామ్‌ సి.ఎస్ సంగీతమందిస్తున్నారు.