హాలీవుడ్ కు నిఖిల్..?

మాజీ కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ‘జాగ్వార్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరోకు మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారు నిర్మాతలు. సొంత నిర్మాణం కావడంతో అది సాధ్యమైందనే మాటలు వినిపించాయి. తెలుగులో ఈ సినిమాకు ఆశించినంత స్పందన రాకపోయినప్పటికీ కర్నాటకలో మాత్రం ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో అక్కడ నిఖిల్ పై క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా నిఖిల్ హాలీవుడ్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన విషయాలను చర్చించేందుకు నిఖిల్ తండ్రి కుమారస్వామి అమెరికా వెళ్ళినట్లు సమాచారం. ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించాలనుకుంటున్నారు. అమెరికాలో గల వైట్ హౌస్ లో దొంగతనం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయనే కథతో సినిమా తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు. ఆ దొంగతనాన్ని బయటపెట్టే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నిఖిల్ కనిపించనున్నాడని తెలుస్తోంది. దక్షిణాదిన ఒకే ఒక్క సినిమాలో నటించిన ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లో సినిమా చేయడం హాట్ టాపిక్ గా మారింది.