రానా ‘బాబు’కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సినిమా ‘యన్‌.టి.ఆర్‌’. ఈ సినిమాకి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇందులో పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాటిలో చంద్రబాబునాయుడి పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన లుక్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

కాగా, గురువారం రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ, మరో స్టిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది చిత్రబృందం. చంద్రబాబుగా గంభీర వదనంతో చేయి ఎత్తి మాట్లాడుతున్న రానా ఫొటో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం జనవరి 9న విడుదలవుతుండగా, రెండో భాగం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్‌బీకే ఫిల్స్మ్‌ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్ర, విబ్రి మీడియా సమర్పిస్తుండగా, కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబరు 16న ట్రైలర్‌ను విడుదల చేస్తుండగా, డిసెంబరు 21న ఆడియో విడుదల వేడుకను నిమ్మకూరులో నిర్వహించనున్నారు.