‘ఒక్కడు మిగిలాడు’ రివ్యూ!

వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు హీరో మంచు మనోజ్. తను నటించిన తాజా చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:

సూర్య(మంచు మనోజ్) కాలేజ్ విద్యార్థి. అతడు శరణార్ధి గా జీవిస్తుంటాడు. అయితే తనతో పాటు అదే కాలనీలో ఉండే ముగ్గురు అమ్మాయిలు పురుగులమందు తాగి మరణిస్తారు. వారి ఆత్మహత్య వెనుక మినిస్టర్ కొడుకులు ఉన్నారని తెలుసుకుంటాడు సూర్య. దీంతో వారికి న్యాయం చేయాలని పోరాటంలోకి దిగుతాడు. దీంతో పోలీసులు అతడిపై డ్రగ్స్ నేరం మోపి స్టేషన్ లో పెట్టి చిత్రహింసలు పెడుతుంటారు. మరి సూర్య పోలీసుల నుండి తప్పించుకున్నాడా..? ఆ ముగ్గురు అమ్మాయిలకు న్యాయం జరిగిందా..? సూర్యకు శ్రీలంకలో ఉండే పీటర్ కు సంబంధం ఏంటి..? అనేదే ఈ సినిమా.

విశ్లేషణ:

దేశం విభజన చెందిన సమయంలో తమిళనాడు నుండి శ్రీలంకకు వెళ్ళిపోయిన శరణార్ధులు తమ జాతి కోసం ఒక దేశం కావాలని కోరుకుంటారు. దానికోసం వారు ఎలా పోరాడారనే అంశం తీసుకొని సినిమాను తెరకెక్కించారు. అప్పటి కథకు ఇప్పటి స్టోరీనూ లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న కథను మెచ్చుకోవాల్సిందే. అయితే ఎగ్జిక్యూషన్ లోపం కారణంగా సినిమా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వదు. ఫ్లాష్ బ్యాక్ లో సాగే యుద్ధ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం.

అయితే అవి మరీ క్రూరంగా ఉండడంతో థియేటర్ లో చూసే ప్రేక్షకుడు కాస్త ఇబ్బంది పడతాడు. పీటర్ అనే పాత్ర తెరపై ఉన్నంతసేపు కూడా సినిమా చాలా ఎమోషనల్ గా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో దాదాపు అరగంటకు పైగా పడవ ప్రయాణం సన్నివేశాలు చూపించి విసిగించారు. వాటికి బదులు మరికొన్ని బలమైన ఎమోషన్స్ ను చూపించగలిగితే బాగుండేది. కథలో రక్తపాతం, హింస ఎక్కువైంది.

మనోజ్ రెండు పాత్రల్లో బాగా నటించాడు. అతడు డైలాగ్స్ చెప్పే తీరు ఆకట్టుకుంటుంది. దర్శకుడు అజయ్ ఆండ్రూస్ పోషించిన పాత్ర సినిమాకు ప్లస్ అయింది. అనీషా ఆంబ్రోస్ జర్నలిస్ట్ గా బాగా నటించింది. మొత్తానికి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇకనైనా మనోజ్ ఇటువంటి కథలకు దూరంగా ఉంటే మంచిది.
రేటింగ్: 1.5/5