తనుశ్రీ వివాదం.. వైరల్‌ వీడియో

ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ నటి తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తనుశ్రీ వెల్లడించింది. 2008 ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా సెట్లో ఓ పాటను షూట్‌ చేస్తున్నారు. కొన్ని షాట్స్‌ తీసిన తర్వాత తనుశ్రీ అర్ధంతరంగా షాట్‌ మధ్యలో వెళ్లిపోయి, కేరవాన్‌లో కూర్చుంది ఆ రోజు సాంగ్‌ షూటింగ్‌ సమయంలో నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ తెలిపింది. అనంతరం నానా పటేకర్‌కు, తనకు మధ్య గొడవ జరిగింది అంది. ఆ వివాదం వల్లే ఆ రోజు తాను షూటింగ్‌ మధ్య నుంచి వెళ్లి పోయానని తనుశ్రీ పేర్కొంది.

తాను కేర్‌వాన్‌లో కూర్చున్న కొద్దిసేపటికి కొందరు రౌడీలు వచ్చి తన కేరవాన్‌ డోర్‌ కొట్టి గందరగోళం సృష్టించినట్లు తనుశ్రీ తెలిపింది. ఈలోపు తన తల్లిదండ్రులు షూటింగ్‌ స్పాట్‌ వద్దకు రావడంతో తాను వారితో కలిసి వెళ్లడానికి కారులో వచ్చి కూర్చున్నాను అని తెలిపింది. ఈ సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి తాము వెళ్తున్న కారును అడ్డుకున్నారని.. కారు అద్దాలను బద్దలుకొట్టి నానా రభస చేశారని తెలిపింది. అంతేకాక ఒక వ్యక్తి కార్‌ మీదకు ఎక్కి గంతులేసాడంటూ తనుశ్రీ ఆ రోజు జరిగిన గొడవ గురించి ఇంటర్వ్యూలో తెలిపింది. కాసేపటి తరువాత పోలీసులు వచ్చి కార్‌ మీద దాడి చేసిన వారిపై యాక్షన్‌ తీసుకున్నారని.. ఆ తరువాతే తాను స్టూడియో నుంచి వెళ్లి పోయానని అంది.

ఆ నాటి గొడవకు సంబంధించి న్యూస్‌ ఎమ్‌వోలో ప్రసారమైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఈ వీడియోలో ఉన్నాయి. దాంతో తనుశ్రీ ఆరోపణలు వాస్తవమేనని అంటున్నారు నెటిజన్లు.