ఆ పాట వెంటాడుతూనే ఉంటుంది: నాగార్జున

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య,  శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. సాయికృపా
ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. అక్కినేని నాగచైతన్య, అఖిల్ లు కలిసి సీడీలను విడుదల చేశారు. ఈ సంధర్భంగా..
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ”షిరిడీసాయి తరువాత మహేష్ రెడ్డి చక్కటి సినిమా తీశారు. ఆయన నాకు మంచి స్నేహితుడు. కీరవాణి గారి పాటలు ఎప్పటినుండో వింటూ వస్తున్నాను. నాకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ‘కమనీయం’ అనే పాట ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. గోపాల్ రెడ్డి ఫోటోగ్రఫీ హైలైట్ గా నిలుస్తుంది. రాఘవేంద్రరావు గారితోనే అందరికంటే ఎక్కువ సినిమాలు చేశాను. ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైనది. ఇదే నా ఆఖరి సినిమా అని రాఘవేంద్రరావు గారు చెప్తూ ఉన్నారు. బహుశా ఆయన డైరెక్షన్ ఇదే
నా లాస్ట్ సినిమా అవ్వొచ్చు. ఇంట్లో పెద్దగా పూజలు జరిపేవారు కాదు. కానీ అమ్మ మాత్రం చేసేది. మొదటిసారి అమ్మతో కలిసి తిరుపతిలో వేంకటేశ్వరస్వామిని చూశాను. ఆ అనుభవం ఎప్పటికి మర్చిపోలేను. అటువంటి వేంకటేశ్వరస్వామి మీద సినిమా చేయడం సంతోషంగా ఉంది.
మా అమ్మ ఆఖరి నిమిషాల్లో ఉన్నప్పుడు చాలా కష్టపడుతుంది. ఆవిడను అలా చూసి మేము తట్టుకోలేకపోయాము.. ఆ సమయంలో భగవంతుడ్ని అడిగాను ‘దేవుడా.. అమ్మను నీ దగ్గరకు తీసుకువెళ్లిపో’ అని. అలానే మనం సినిమా పెద్ద హిట్ కావాలని కోరాను. నా బిడ్డల్ని జాగ్రత్తగా చూస్కో అని కోరుకొని వచ్చే రోజే ఇద్దరికీ పెళ్లి అనే వార్త వినిపించింది. అన్నమయ్య, రామదాసు, షిరిడీసాయి ఇప్పుడు ఓం నమోవెంకటేశాయ సినిమాలు చేసే అవకాశం రావడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం అని భావిస్తున్నాను” అన్నారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ”స్వామి కోరికలు తీరుస్తాడు.. అడగకముందే అన్నీ ఇస్తాడు. అందరి హీరోలతో, అన్ని రకాల సినిమాలు చేసే అవకాశాలు ఇచ్చాడు. అన్నమయ్య, రామదాసు, పాండురంగడు ఇలా అడగకుండానే అన్ని సినిమాలు ఇచ్చాడు. కానీ వెంకటేశ్వరస్వామి గురించి తీయలేదనే బాధ ఉండేది. ఆ సమయంలో ‘ఓం నమో వెంకటేశాయ’ అనే సినిమా వచ్చింది. కథ, నిర్మాత అంతా వెంటవెంటనే రెడీ అయిపోయింది. భక్తుడిగా నాగార్జున తప్ప మరెవరూ సెట్ కారనిపించింది. నాగార్జున నటించేప్పుడు స్వామిని నాగార్జున చూసే చూపులు అధ్బుతం. ఓ మహా భక్తురాలిని పెట్టాలనుకున్నప్పుడు అనుష్క స్ట్రైక్ అయింది. గోదాదేవి గెటప్ లో అధ్బుతమైన నటనను కనబరిచింది. ప్రగ్యా తన నటనతో కథకు గ్లామర్ ను యాడ్ చేసింది” అన్నారు
నిర్మాత మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ”ఈ సినిమా మరో అన్నమయ్య అవుతుంది. అంత అధ్బుతంగా ఉంటుంది. కొత్త జెనరేషన్ వారు దేవుడి గురించి మర్చిపోతున్నారు. వారికి ఈ సినిమా ద్వారా దేవుడి మహత్యాల గురించి తెలియజెప్పుతున్నాం” అన్నారు.
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ.. ”రాఘవేంద్రరావు గారు సంకల్పించిన ఈ బృహత్ కార్యక్రమం పెద్ద సక్సెస్ కావాలి” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో అనుష్క, విమలారామన్, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు.