ఆది ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్’ టీజర్‌ చుశారా!

హీరో ఆది ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్’. సాయి కిరణ్‌ అడవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా.. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘నువ్వు చేసిన తప్పు వల్ల కొన్ని ప్రాణాలు పోయాయి’ అంటూ పై అధికారి ఆదిని తిడుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ‘కశ్మీర్‌ పాకిస్థాన్‌ది.. వెంటనే వదిలేసి వెళ్లిపోండి’ అంటూ పలువురు ఉగ్రవాదులు ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న సన్నివేశాలను సహజంగా చూపించారు. చివర్లో ”ఓ భారతీయుడు ఎప్పుడూ ఇచ్చిన మాటను తప్పడు’ అని ఆది చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. రచయిత అబ్బూరి రవి ఈ చిత్రంతో నటుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో ఆయన తీవ్రవాది ఘాజీ బాబా పాత్రలో నటించారు. ఎన్‌ఎస్‌జి(నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌) కమాండో అర్జున్‌ పండిట్‌ పాత్రలో ఆది నటించారు. సాషా చెత్రి, కార్తీక్‌రాజు, పార్వతీశం, నిత్యానరేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.