గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏపీ మంత్రి పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు, వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రలకే పరిమితమని.. ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై అవగాహన లేని జగన్ టీడీపీపైనా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్‌కు వంతపాడుతున్నారని.. వైసీపీ, బీజేపీ కుమ్మక్కై టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రాభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సునీత వ్యాఖ్యానించారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని కన్నా, జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏ ప్రభుత్వం చేయనిరీతిలో తమ ప్రభుత్వం రాయలసీమను అభివృద్ధి చేసిందని చెప్పారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో డ్వాక్రా మహిళలకు రూ.2,300కోట్ల వడ్డీ రాయితీ ఇస్తే తాము నాలుగేళ్లలోనే రూ.2,500 కోట్లు చెల్లించామన్నారు. రూ.50వేల కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు చెల్లించామని మంత్రి తెలిపారు.













