చంద్రబాబు ‘బయోపిక్‌’ ఫ్లాప్ అవ్వడం ఖాయం: పవన్‌

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు భేటీపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ, కాంగ్రెస్ కలయిక చంద్రబాబు ఉనికి కోసమే అన్నారు. బెజవాడ నుంచి రైలులో బయల్దేరిన పవన్ కల్యాణ్ టీమ్‌ తుని వరకు ప్రయాణం చేయనుంది.. ఇప్పటికే నూజివీడు దాటి ఏలూరు చేరుకుంది రైలు.. దారి పొడవునా రైల్వేస్టేషన్ లో స్వాగతం పలుకుతున్నారు అభిమానులు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పదవి కాపాడుకోవడం కోసమే ఢిల్లీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు చూపింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిదన్న జనసేనాని… కానీ, చంద్రబాబు సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీతో కలయిక చూస్తాంటే.. ఆయన ఎక్కడ మొదలయ్యారో.. ఎక్కడికే చేరుకున్నట్లో అనిపిస్తోందన్నారు. బలమైన పోరాటం హోదా కోసం చేయాలని సూచించిన పవన్.. ప్రజా సమస్యల పరిష్కారం వల్లే సమీకరణాలు మారతాయి తప్ప… పార్టీల కలయికల వల్ల కాదన్నారు.