జనసేన మద్దతు లేకుండా ఆ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు: పవన్‌

ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో శనివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. 2019-24 మధ్య దేశ రాజకీయాల్లో సమూల మార్పులు రానున్నాయి.. సరికొత్త నాయకత్వం రానుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్ణాటక తరహాలో మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని, భాగస్వామ్య ప్రభుత్వం అనివార్యమని వివరించారు. జనసేనకు అయిదు, ఆరు సీట్లు వస్తాయా? అని ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారని, ఎన్ని సీట్లు వచ్చినా తమ మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటుకాబోవని తెలిపారు. 2019 ఎన్నికలలో జనసేన కీలకం కానుందనీ.. టీడీపీ, వైసీపీలు జనసేన మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని లగడపాటి రాజగోపాల్‌ తనతో చెప్పారని వివరించారు. ప్రస్తుతం రెండు పార్టీలతో సమదూరంలో ఉన్నామని, వారి బాధ్యతలను గుర్తు చేస్తున్నామని, వారితో పోరాడుతున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి ఇటీవల మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌కు ప్రాణహాని ఉంటే భద్రత కల్పిస్తామన్నారని, తాను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే ప్రాణం మీద ఆశలు వదులుకున్నానని, తనపై దాడులు చేసేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తున్నారని పవన్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుత పోరాటానికైనా, హింసాత్మక పోరాటానికైనా సిద్ధమని.. టీడీపీ ప్రభుత్వం వీటిలో ఏది కావాలో ఎంపిక చేసుకోవాలని అన్నారు. జనసేన పిడికిలికి ఉన్న బలం రెండు చేతివేళ్లకు ఉండదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నలుగురు భద్రతా సిబ్బందిని తనకు కేటాయించగా.. తిరస్కరించానని, వీరిలో ఒకరు తన సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేసేవారని వివరించారు.

తన వద్ద ఏం నిఘా సమాచారం ఉంటుందని.. నేనేమైనా దోపిడీదారునా? మోసగాడినా? అంటూ పవన్‌ ప్రశ్నించారు. ఏలూరులో తాను సేదదీరుతున్న ప్రదేశానికి 30మంది వచ్చి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. మహిళా ఎమ్మెల్యే పీతల సుజాత నియోజకవర్గంలో జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నాడని వివరించారు. రౌడీయిజం చేసే ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎందుకు భర్తరఫ్‌ చేయడం లేదని ప్రశ్నించారు. 14 వేల కి.మీ.రహదారులను నిర్మించామని మంత్రి లోకేష్‌ చెబుతున్నారని, రహదారులు చూస్తే భయం వేస్తోందని పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరకు ఎన్నికల మేనిఫెస్టోను తయారుచేస్తున్నామని.. మహిళలు, దివ్యాంగులు, యువత సంక్షేమమే లక్ష్యమని పవన్‌ కల్యాణ్ వివరించారు.