HomeTelugu Newsసీఎం జగన్‌కు లేఖరాసిన పవన్‌కళ్యాణ్‌

సీఎం జగన్‌కు లేఖరాసిన పవన్‌కళ్యాణ్‌

12 16ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ లేఖ రాశారు. వంద రోజుల పాటు ప్రజా డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచకుండా కాస్త సమయం ఇద్దామని అనుకున్నామనీ.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక విజ్ఞప్తులు వచ్చినా సంయమనం పాటించామని తెలిపారు. అయితే, భవన నిర్మాణ కార్మికుల బాధలు చూసి ఈ లేఖ రాస్తున్నట్టు పవన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారని తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు పనుల్లేక అల్లాడుతున్నారని పవన్‌ లేఖలో పేర్కొన్నారు. కొద్ది రోజులుగా భవన నిర్మాణ కార్మికుల నుంచి తమకు అనేక వినతులు వచ్చాయని.. తమ పార్టీ కార్యాలయానికి కూడా కొందరు కార్మికులు వచ్చి తమ బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు.

సెప్టెంబర్‌ 5లోగా ఇసుక విధానం ప్రకటిస్తామని సీఎం జగన్‌ చెప్పారని.. అప్పటివరకు కూలిపనులు చేసుకొనే వారి పరిస్థితి ఏంటని పవన్‌ ప్రశ్నించారు. కార్మికులు, కూలీల ఆకలి బాధలు రాష్ట్రానికి క్షేమకరం కాదన్నారు. భవన నిర్మాణ కార్మికులకు తక్షణం ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కార్మికుల భృతికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై పలుమార్లు ప్రస్తావించానని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం తెచ్చే ఇసుక విధానం అక్రమాలకు తావివ్వని విధంగా ఉండాలన్నారు. ఇసుక విధానం ఇంటి యజమానులు, గుత్తేదార్లు, కార్మికులకు అనుకూలంగా ఉండాలని పవన్‌ లేఖలో కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చే ఇసుక విధానం బాగుంటే జనసేన కూడా అందుకు మద్దతిస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని పవన్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu