మీ భార్య నన్ను తిడుతుంటుంది కదా.. అక్షయ్‌ను ఆటపట్టించిన మోడీ

మీ భార్య ఎప్పుడూ నన్ను తిడుతుంటారు కదా.. ‘అంటూ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ను ఆటపట్టించారు ప్రధాని నరేంద్ర మోడీ. తొలిసారి అక్షయ్‌.. మోడీని ఇంటర్వ్యూ చేశారు. ఓ విలేకరికి కాకుండా సినీ నటుడికి మోడీ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ముఖాముఖి నేపథ్యంలో మోడీ.. అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా గురించి ప్రస్తావించారు.

‘నేను మిమ్మల్ని, ట్వింకిల్‌ ఖన్నాజీని సోషల్‌మీడియాలో ఫాలో అవుతాను. ఆమె నన్ను ఎలా టార్గెట్‌ చేస్తుంటారు? అన్న విషయాలను గమనిస్తుంటాను. ఆమె ఇంట్లో నా గురించి ప్రస్తావిస్తూ కేకలు వేస్తుంటారు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటారనుకుంటా’ అని చమత్కరించారు. దాంతో అక్షయ్‌ పగలబడి నవ్వుకున్నారు. మోడీ వ్యాఖ్యలపై ట్వింకిల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘నేను మోడీజీ అన్న మాటలను పాజిటివ్‌గా తీసుకుంటాను. నేనంటూ ఒకదాన్ని ఉన్నానని మోడీజీ గుర్తించడమే కాదు.. నా పనిని కూడా ఆయన గమనిస్తుంటారు’ అన్నారు. తన గురించి సోషల్‌మీడియాలో వచ్చే జోకులు, మీమ్‌లను చూసి ఎంజాయ్‌ చేస్తుంటానని ఈ సందర్భంగా మోడీ వెల్లడించారు.