ప్రియా వారియర్‌ లిప్ లాక్ .. వైరల్‌

కన్నుగీటి యువకుల మనసులను కొల్లగొట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మరోసారి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కన్ను గీటుతూ ఉన్న ఓ సన్నివేశం అప్పట్లో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆ సన్నివేశమే ప్రియా వారియర్‌కు రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు మరో వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. తన మొదటి చిత్రం ‘ఒరు అడార్‌ లవ్‌’ లో హీరోగా నటించిన అబ్దుల్‌ రహూఫ్‌తో కలిసి చేసిన లిప్‌లాక్‌ సన్నివేశం ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ విరుచుకుపడుతున్నారు. ప్రమోషన్‌ కోసం చీప్‌ ట్రిక్స్‌ను ఆశ్రయిస్తున్నారంటూ మండిపడుతున్నారు. దీంతో కొందరు పెద్ద ఎత్తున వీడియోను డిస్‌లైక్‌ చేస్తున్నారు.

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ‘ఒరు అడార్‌ లవ్‌’ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రాత్రికి రాత్రే స్టార్‌ అయిన ఈ నటి క్రేజ్‌ను చూసి దర్శకుడు దక్షిణాదిన మలయాళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘లవర్స్‌ డే’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌, పాటలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలుసార్లు వార్తల్లో నిలిచిన ఈ భామ రెండో సినిమా ‘శ్రీదేవి బంగ్లా’ కూడా వివాదాల చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే దివంగత నటి శ్రీదేవి భర్త దీనిపై కోర్టును ఆశ్రయిస్తానంటూ ప్రకటించారు.