నిక్‌ ప్రమాణంతో ప్రియాంక భావోద్వేగం

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ల వివాహం హిందూ సంప్రదాయంలో అట్టహాసంగా జరిగింది. ఇప్పటికే క్రైస్తవ సంప్రదాయంలో ఈ జంట ఒక్కటైన విషయం తెలిసిందే. నవంబర్‌ 30 నుంచి జరుగుతున్న వివాహ వేడుకలు కూడా ముగిశాయి. త్వరలోనే నిక్యాంక ఢిల్లీలో వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు. మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకి వచ్చినప్పటికీ వివాహపు ఫొటోల కోసం వీరిద్దరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే హిందూ సంప్రదాయ వివాహం పూర్తయిన వెంటనే ప్రియాంక కుటుంబ సంప్రదాయం ప్రకారం ప్రమాణాలు జరిగాయట. ఇందులో భాగంగా నిక్‌ ప్రమాణపు ప్రసంగాన్ని వినిపించాడు. ప్రియాంకను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటానని ఆమెకు అందరి ముందూ మాటిచ్చాడు. దీంతో ఒక్కసారిగా ప్రియాంక భావోద్వేగానికి గురయ్యిందని ఆమె సన్నిహితులు తెలిపారు. వారి సంప్రదాయం ప్రకారం ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్‌ వధూవరులకు వివాహంలోని ఏడు ప్రమాణాల గురించి వివరించాడు. సిద్ధార్థ్‌ వాటిని వివరించిన విధానం తనకెంతో నచ్చిందని ప్రియాంకతోపాటు సిద్ధార్థ్‌ని కూడా బాగా చూసుకుంటానని నిక్‌ అన్నాడట.