బిగ్‌బాస్‌ పై ధర్నా.. ఈ షో నిలిపివేయాలంటున్న నిర్మాత

తెలుగు బిగ్‌బాస్‌-3 నిలిపేయాంటూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జర్నలిస్టు శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తా జంతర్‌ మంతర్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్‌బాస్‌ పేరుతో అశ్లీలతను పోత్రహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయమై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశామని చెప్పారు. బిగ్‌బాస్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ ఉన్న కారణంగానే శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా షో నుంచి బయటికొచ్చారని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. అక్కడ జరుగుతున్న విషయాలను సినీ హీరో నాగార్జున తెలుసుకోవాలని కోరారు.

బిగ్‌బాస్‌ సెలక్షన్‌ ప్రాసెస్‌లో అన్యాయం జరుగుతోందని నటి గాయత్రిగుప్తా అన్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. షో పేరుతో లైంగిక వేధింపులు, చీటింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. పబ్లిసిటీ కోసమే చేస్తున్నామని తమను నిందిస్తున్నారని, అలాంటప్పుడు లీగల్‌గా ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. జర్నలిస్టు శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ను నిషేదించాలన్నదే తమ డిమాండ్‌ అన్నారు. బిగ్‌బాస్‌ ముసుగులో మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న లైంగికంగా వేధింపులపై దేశవ్యాప్తంగా అందరి సహకారం కోరుతున్నామని చెప్పారు. కాగా ఈ నెల 21 నుంచి మా టీవీలో ‘బిగ్‌బాస్‌’ ప్రసారమవుతుందన్నది తెలిసిందే.