మద్యం సేవించడం వల్లే లావైపోయాను: రాధికా ఆప్టే

సినీ నటి రాధికా ఆప్టే.. బాగా మద్యం సేవించి లావైపోవడంతో సినిమా అవకాశం కోల్పోయానని అంటున్నారు. ఈ విషయాన్ని ‘బీఎఫ్‌ఎఫ్‌’ అనే షోలో ఆమె వెల్లడించారు. హిందీలో విజయవంతమైన ‘విక్కీ డోనర్’ చిత్రంలో రాధికకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. సినిమా చిత్రీకరణకు ఇంకా సమయం ఉందనగా రాధిక కొద్దిరోజులు విహారయాత్రకు వెళ్లారు. బాగా తిని, బీరు తాగి లావయ్యారు. దాంతో ఆమెను సినిమా నుంచి తప్పించారు. అయితే కొద్దిరోజులు సమయం ఇస్తే మళ్లీ సన్నబడతానని నిర్మాతలతో చెప్పారు. కానీ వారు ససేమిరా అన్నారు.

దాంతో ఆమె స్థానంలో యామీ గౌతమ్‌ ఎంపికయ్యారు. అప్పటినుంచి తిండి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నానని రాధిక తెలిపారు. అయితే సినిమా చేజార్చుకున్నందుకు బాధ లేదని.. బరువు పెరగడం వల్ల తప్పించడంతో తనకు చిర్రెత్తుకొచ్చిందని పేర్కొన్నారు.

‘విక్కీ డోనర్‌’ సినిమాను తెలుగులో ‘నరుడా డోనరుడా’ టైటిల్‌తో రీమేక్‌ చేశారు. ఈ చిత్రంలో సుమంత్‌ హీరోగా నటించారు. తెలుగులో ‘రక్తచరిత్ర’, ‘లెజెండ్‌’, ‘ధోనీ’ సినిమాల్లో నటించిన రాధిక.. ఆ తర్వాత హిందీ సినిమాలకే పరిమితమైపోయారు. ఆమె ప్రస్తుతం రెండు హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.