రాజమౌళి చూపు బాలీవుడ్ వైపు..?

‘బాహుబలి’ చిత్రంతో దర్శకుడు రాజమౌళి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. అయితే ఆ  సినిమా తరువాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు..? ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమా ఓ చిన్న హీరోతో ఉంటుందని ఒకసారి, ఎన్టీఆర్ తో చేస్తాడని మరోసారి ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. అయితే మరికొందరు ఆయన తెలుగులో కాకుండా బాలీవుడ్ లో సినిమా చేస్తాడని అన్నారు. ఇప్పుడు నిజంగానే ఆయన బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఓ స్ట్రెయిట్ హిందీ సినిమా చేయాలని భావిస్తున్నాడు. 
బాలీవుడ్ కు సంబంధించిన ఓ యంగ్ హీరోతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. నిర్మాత డివివి దానయ్య అడ్వాన్స్ రాజమౌళి దగ్గర ఉండడంతో ఈ హిందీ సినిమాకు ఓ బాలీవుడ్ నిర్మాతతో పాటు దానయ్య కూడా నిర్మాతగా వ్యవహరిస్తాడట. ఫాంటసీ, ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. మంచి యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తీసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని టాక్. ఈ సినిమా పూర్తయిన తరువాత ఓ స్టార్ హీరోతో తెలుగులో సినిమా చేస్తారని సమాచారం. ఈ ఏడాది ఆఖరున ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఇన్సైడ్ టాక్. నిర్మాతతో కూడా రాజమౌళి ఈ విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది.