రూ.200 కోట్ల క్లబ్‌లో రజనీ ‘2.ఓ’

‘2.ఓ’ సినిమా బాక్సాఫీసు వద్ద విజయకేతనం ఎగరవేసింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. గతంలో రజనీ నటించిన ‘రోబో’, ‘కబాలి’ సినిమాలు కూడా రూ.200 కోట్లకు పైగా సాధించాయి. ఈ వరుసలో ఇప్పుడు మూడో సినిమాగా ‘2.ఓ’ చేరింది. దక్షిణ చిత్ర పరిశ్రమలో రూ.200 కోట్లు రాబట్టిన మూడు సినిమాలున్న కథానాయకుడు తలైవానేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఏ హీరోకు చెందిన మూడు సినిమాలు రూ.200 కోట్ల క్లబ్‌లో చేరలేదన్నారు.కేవలం చెన్నై నగరంలోనే ‘2.ఓ’ మూడు రోజుల్లో రూ.10 కోట్లు రాబట్టినట్లు తెలిసింది. అమెరికాలో 2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. అక్కడ దాదాపు రూ.13 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్‌లో రూ.63.25 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తెలిపారు. రెండో రోజుతో పోల్చితే మూడో రోజు వసూళ్లు 23.46 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. నాలుగో రోజు కలెక్షన్‌ ఇంకా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా గురువారం (తొలిరోజున కేవలం హిందీలో) రూ.20.25 కోట్లు, శుక్రవారం రూ.18 కోట్లు, శనివారం రూ.25 కోట్లు మొత్తం రూ.63.25 కోట్లు సాధించినట్లు ట్వీట్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్షయ్‌ కుమార్‌ విలన్‌ పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. దాదాపు రూ. 550 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందే శాటిలైట్‌, డిజిటల్‌ తదితర హక్కుల ద్వారా సినిమా దాదాపు రూ.370 కోట్లు రాబట్టిందట.