ఎన్నికల్లో పోటీ చేయడంలేదు.. నా పేరు వాడుకోవద్దు: రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. తమిళనాడుకు నీటి సమస్యలు లేకుండా చేసే పార్టీకే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. ‘రజనీ మక్కల్‌ మండ్రమ్‌’ అనే అభిమాన సంఘం పేరిట తన రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కానీ తాజా ప్రకటనతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.