చరణ్‌ ఎంట్రీకి డేట్‌ ఫిక్స్‌ .. వీడియో వైరల్‌

ఈ జనరేషన్‌ స్టార్లు సినిమాల్లో నటించటంతో పాటు అభిమానులకు అందుబాటులో ఉండేందుకు కూడా సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి.

ఇతర హీరోలందరూ సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంటే చరణ్ మాత్రం ఇంతవరకు ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలోనూ లేడు. తాజాగా తన సోషల్‌ మీడియా ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ చేశాడు చెర్రీ. ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇప్పటికే చరణ్‌ @alwaysramcharan ఐడీతో ఇన్స్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. ఈ అకౌంట్‌ ద్వారా శుక్రవారం (జూలై 12)తొలి పోస్ట్ చేయనున్నాడు చరణ్‌.

చరణ్‌ ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే సోషల్ మీడియాలో రికార్డ్స్‌ సృష్టిస్తున్నాడు. అకౌంట్ క్రియేట్ చేసిన 5 గంటల్లోనే దాదాపు 50 వేల మందికి పైగా ఆ అకౌంట్‌కు ఫాలోవర్స్‌ అయ్యారు.12 గంటల్లోనే లక్షా 30 వేల మందికి పైగా ఫాలోవర్స్‌ అయ్యారు. ఇప్పటికే ఈ అకౌంట్‌ను 2 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు. చరణ్‌ తొలి ట్వీట్ చేసిన తరువాత మరిన్ని రికార్డ్‌లు క్రియేట్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.