అగ్నిప్రమాదంపై స్పందించిన రామ్‌చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సెట్‌లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సినీ నటుడు రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ‘దురదృష్టవశాత్తు ‘సైరా’ సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన కోకాపేట్‌లో చోటుచేసుకుంది. అదృష్టం బాగుండి ఈ ఘటనలో చిత్రబృందంలోని ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఎవ్వరూ గాయపడలేదు. త్వరలో ఆఖరి షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తిచేయాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

సురేందర్ రెడ్డి ‘సైరా’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార.. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రను పోషిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్‌ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates