పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన రామ్‌చరణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను.. రామ్‌చరణ్‌ ఆదివారం కలిశారు. వడదెబ్బ కారణంగా అనారోగ్యం పాలైన పవన్‌ ప్రస్తుతం విజయవాడలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం చరణ్‌ ఆయన నివాసానికి వెళ్లారు. ఈ విషయాన్ని చరణ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ పవన్‌ను వైద్యుడు చెకప్‌ చేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘నేనెంతో ఇష్టపడే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశాను. ఆయన చాలా నీరసంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు కొంత విరామం ఇచ్చి బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కానీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈరోజు అనకాపల్లి, పెందుర్తిలో ప్రచారానికి వెళ్తున్నారు. ప్రచారంలో వైద్యులు కూడా ఆయన వెంటే ఉంటానని అన్నారు. కానీ బాబాయ్‌ అందుకు ఒప్పుకోలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని, ప్రజలకు సేవ చేయడంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

పవన్‌ పరిస్థితిపై చరణ్‌ సతీమణి ఉపాసన కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నాకు రాజకీయాల గురించి తెలీదు. కానీ కుటుంబ సభ్యురాలిగా, ఓ స్నేహితురాలిగా నేను చేయాల్సిన డ్యూటీ ఏంటో నాకు తెలుసు. నా కుటుంబం నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఎన్నికలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో నాకు తెలుసు. భారతీయ పౌరులుగా మనం చేయాల్సింది ఓటెయ్యడమే’ అని వెల్లడించారు.