మహేష్‌ ‘ఏఎంబీ’ థియేటర్‌కు ఓ సమస్య ఉంది

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రారంభించిన ఏఎంబీ(ఏషియన్‌ మహేశ్‌బాబు) థియేటర్‌కు ఓ సమస్య ఉందని అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆదివారం సూపర్‌స్టార్‌ కృష్ణ చేతుల మీదుగా ఈ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వర్మ ఈ థియేటర్‌లో ఓ సినిమా చూశారట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సూపర్‌ప్లెక్స్‌లో ఓ సమస్య ఉందని వర్మ అంటున్నారు. అదేంటంటే.. ఈ అద్భుతమైన ప్రదేశంలో ఏ సినిమా చూసినా థియేటర్‌కు ఉన్న అందంతో సరిపోదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. థియేటర్‌ సూపర్ ‌డూపర్‌ బ్లాక్‌బస్టర్‌గా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

గతంలో ఏఎంబీ సినిమాస్‌ గురించి వర్మ స్పందిస్తూ.. థియేటర్‌ కూడా మహేశ్‌బాబు లాగే అందంగా ఉందని కొనియాడారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి గచ్చిబౌలిలోని బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో ఈ థియేటర్‌ను నిర్మించారు. ఈ థియేటర్‌లో ‘2.ఓ’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలను ప్రదర్శిస్తున్నారు. దాంతో ఆదివారం థియేటర్‌ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. థియేటర్‌లోని మహేష్‌బాబు పోస్టర్లు, ఫ్లెక్సీలతో కలిసి అభిమానులు తెగ సెల్ఫీలు దిగారు. ఏఎంబీ సినిమాస్‌ ట్విటర్‌లో బాగా ట్రెండ్‌ అవుతోంది.