తెలుగు ‘గల్లీబాయ్‌’ రీమేక్‌పై ఓటింగ్‌ నిర్వహించిన ఓ ఆంగ్ల పత్రిక.. రానా స్పందన!

బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘గల్లీబాయ్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రీమేక్‌ హక్కుల్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ నటించే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. కాగా ఈ రీమేక్‌ గురించి ఓ ఆంగ్ల పత్రిక ఆసక్తికరమైన కథనం రాసింది. విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌, రానా.. ఈ ముగ్గురిలో ఎవరు ‘గల్లీబాయ్‌’ తెలుగు రీమేక్‌కు సరిపోతారని నెటిజన్లను ప్రశ్నిస్తూ ఓటింగ్‌ నిర్వహించింది. ఈ మేరకు సదరు పత్రిక చేసిన ట్వీట్‌ను చూసిన రానా స్పందించారు. ‘నన్ను వదిలేయండి.. నాకు అంత నైపుణ్యం లేదు’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్‌ చేశారు. దీనికి నెటిజన్లు రిప్లై ఇచ్చారు. ‘రానా.. గొప్ప నటుడు, మీరు ఏదైనా ప్రత్యేకంగా ఉంటేనే చేస్తారు..’ అని పేర్కొన్నారు.

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన సినిమా ‘గల్లీబాయ్’. ఈ చిత్రంలో ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటించింది. జోయా అక్తర్‌ దర్శకత్వం వహించారు. కల్కీ కొచ్లిన్‌, విజయ్‌ రాజ్‌, విజయ్‌ వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైగర్‌ బేబీ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మించాయి. ఇందులో రణ్‌వీర్‌ ర్యాపర్‌గా పేరు తెచ్చుకోవాలని కృషి చేస్తూ కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సినిమా ప్రముఖుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబడుతోంది.