‘రంగస్థలం’ జబితాలో మరో అరుదైన రికార్డు

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా తో కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరోవైపు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించిన ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్‌, నరేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ‘రంగస్థలం’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో పాటు రూ.115 కోట్ల షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. ఒక్క ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఈ మూవీ మూడున్నర మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి 2018 టాలీవుడ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.

ఇప్పటికే ‘రంగస్థలం’ తమిళం, మలయాళంలో డబ్ చేసారు. తాజాగా రంగస్థలం సినిమాను కన్నడలో ‘రంగస్థల’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. కన్నడలో కేజీఎఫ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కన్నడ సినిమాలు వేరే భాషల్లో డబ్ అయినపుడు వేరే భాషల సినిమాలకు కన్నడలో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతల మండలి తీర్మానం చేసింది.

దీంతో దశాబ్దాల తర్వాత కన్నడలో డబ్ అవుతున్న తెలుగు సినిమాగా ‘రంగస్థలం’ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో ‘మాయా బజార్’ తర్వాత మరో సినిమా ఏది కన్నడలో డబ్ కాలేదు. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత రంగస్థలం కన్నడ డబ్బింగ్‌తో మరో రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో భారీ సక్సెస్ సాధించిన ‘రంగస్థలం’ కన్నడలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.