రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు

టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు పోలీసులిచ్చిన నోటీస్ గడువు ముగిసింది. అందువల్ల బుధవారం ఉ.11 గంటలకు ఆయన పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. ఆయన హాజరు కాలేదు కాబట్టి, ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అందువల్ల రవి ప్రకాష్ అరెస్టవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు రవి ప్రకాష్ కోసం గాలిస్తున్నారు. అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదుతో రవి ప్రకాష్‌పై ఫోర్జరీ, డేటా చోరీ కేసులు నమోదుచేశారు. ఈ నెల 9న రవి ప్రకాష్ ఇంట్లో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. తనిఖీలు చేసిన రోజు నుంచీ రవి ప్రకాష్ కనిపించట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్లిందీ చెప్పలేదని ఆయన భార్య తెలిపారు. రవి ప్రకాష్ ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉన్నాయి. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు… చివరిగా CRPC 41 కింద మరో నోటీస్ జారీ చేశారు. దాని ప్రకారం ఆయన 3 రోజుల్లో పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. అలా జరగలేదు కాబట్టి అరెస్టు చేసే అవకాశాలున్నాయంటున్నారు.

ఇక ఇదే కేసులో టీవీ 9 మాజీ డైరెక్టర్ MVVN మార్తిని పోలీసులు సోమవారం ప్రశ్నించారు. టీవీ 9లో ఎవరు షేర్లు కొన్నారు.. ? ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయా? ఫోర్జరీ లేఖను ఎవరు తయారుచేశారు ? అని ప్రశ్నించారు. ఆయన నుంచీ సేకరించిన ఆధారాలతో… రవి ప్రకాష్‌ను ప్రశ్నించనున్నారు. ఆ తర్వాత ఈ కేసుపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారని చెబుతున్న సంతకంతోపాటు ఫోర్జరీ వల్ల ఇబ్బందులు పడినట్లు చెబుతున్న వ్యక్తి అసలు సంతకాన్ని పోలీసులు ఇంతకుముందే సేకరించారు. ఆ రెండింటినీ పోల్చటంతోపాటు వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, ప్రాథమిక నివేదిక తెప్పించుకున్నారు. తనపై ఉన్న కేసులపై రవి ప్రకాష్ ఓవైపు నలంద మీడియా సంస్థ ప్రతినిధులతో రాజీ ప్రయత్నాలు చేస్తూ… మరోవైపు తనను అరెస్టు చెయ్యకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయన ముంబై వెళ్లారనీ, కాదు ఏపీ వెళ్లారనీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విచారణకు హాజరైతే కచ్చితంగా అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో రవిప్రకాష్… విచారణకు హాజరు కావట్లేదని చెబుతున్నారు.