Homeతెలుగు Newsకేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలి:కేసీఆర్‌

కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలి:కేసీఆర్‌

8 15ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అంటే తాను ఢిల్లీకి వెళ్తానని కాదని.. తెలంగాణలోనే ఉండి కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తానన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు తానే నిర్ణయం తీసుకున్నానన్నారు. బుధవారం ఆయన దేవరకొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కొత్త రాష్ట్రంలో పెరిగిన గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి మోడీకి ఏమైంది? ఆయన ఆలోచనలకు చెదలు పట్టాయా? అని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. బీజీపీ, కాంగ్రెస్‌ ఇద్దరూ దొందూ దొందేనన్నారు. ఆ రెండు పార్టీల జెండాల రంగులు మాత్రమే మారాయన్నారు. రాష్ట్రాలకు మున్సిపాలిటీలుగా మార్చి హక్కులను హరించి ప్రజలకు న్యాయం జరగకుండా కర్రపెత్తనం చెలాయిస్తున్నాయని దుయ్యబట్టారు. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ముస్లింలకు జరగాల్సిన న్యాయం జరగడంలేదన్నారు. ఆ స్థితి మారాలంటే కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో రావడానికి ఈ ఎన్నికల తర్వాత ప్రయత్నం చేస్తామని పునరుద్ఘాటించారు. తద్వారా దేశ ప్రజల హక్కులను, రిజర్వేషన్లను పరిరక్షిస్తామని చెప్పారు.

విపక్షాలు ఎన్ని మాయలు చేసినా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఆగదని కేసీఆర్‌ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను కేంద్రం మెడలు వంచైనా సాధిస్తామన్నారు. పెద్దమునిగల్‌ వద్ద లిఫ్ట్‌ ఏర్పాటు చేసి నేరేడిగొమ్మును అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి దేవరకొండను సస్యశ్యామలం చేస్తామన్నారు. తండాలను గ్రామ పంచాయితీలుగా చేసి .. వాళ్లే పాలించుకునేలా చేశామన్నారు. అత్యధికంగా దేవరకొండలో నియోజకవర్గంలోనే 85 తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని చెప్పారు. పెరిగిన గిరిజన జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ల పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని, తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లును మోడీ ప్రభుత్వం ఆమోదించకుండా చాన్నాళ్లుగా పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. గిరిజన, ముస్లిం సోదరుల రిజర్వేషన్లకు సంబంధించి మోదీని 20 నుంచి 30 సార్లు స్వయంగా వెళ్లి చెప్పానని, 50 ఉత్తరాలు కూడా రాశానన్నారు. కేంద్రం మెడలు వంచైనా ఎస్టీ రిజర్వేషన్ల బిల్లును సాధిస్తామని హామీ ఇచ్చారు.

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు అవసరమా? అని కేసీఆర్‌ అన్నారు. పొరుగు రాష్ట్రంలో ఉండే చంద్రబాబును కాంగ్రెస్‌ నేతలు భుజాలపై ఎక్కించుకొని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కృష్ణానదిపై ప్రాజెక్టులు కట్టనీయొద్దంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబును కాంగ్రెస్‌వాళ్లు మళ్లీ తీసుకొస్తున్నారన్నారు. ప్రజలంతా ఆలోచించి ఓటుతో తగిన గుణపాఠం నేర్పాలని విజ్ఞప్తి చేశారు. దేవరకొండ ఆర్థికంగా వెనుకబడినప్పటకీ ఇక్కడ కవులు, కళాకారులు, మేధావులు ఉన్నారని చెప్పారు. తెరాస ప్రభుత్వం కలలో కూడా ఊహించని అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 24గంటల పాటు విద్యుత్‌ అందిస్తోందన్నారు. పొరపాటున కాంగ్రెస్‌అధికారంలోకి వస్తే మళ్లీ తెలంగాణ చీకటిమయమవుతుందన్నారు. ఎన్నికల్లో నేతలు ఇచ్చిన హామీలతో మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu