విక్రమ్‌ ‘సామి’ ట్రైలర్‌

విలక్షణ నటుడు విక్రమ్, మాస్‌ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి కాంబినేషన్‌లో పదిహేనేళ్ల క్రితం ఘనవిజయం సాధించిన సినిమా ‘సామి’. ఇన్నేళ్ల తరువాత అదే కాంబినేషన్‌లో సామి సినిమాకు సీక్వెల్‌ను రూపొందించారు. తమిళ్‌లో ‘సామి 2’ పేరుతో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాను తెలుగులో ‘సామి’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. విక్రమ్‌ను మరోసారి పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో చూపించాడు దర్శకుడు హరి. శిబు థామీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్.

తాజాగా ఈ సినిమా అఫీషియల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. విక్రమ్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. ‘మత్స్యస్వామి, కూర్మస్వామి, వరాహస్వామి, నరసింహస్వామి, రావణ స్వామి, పరశురామస్వామి.. అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. జీవితంలో ఇంకెవర్నీ ప్రేమించకూడదు.. అని విక్రమ్‌ తన ప్రేయసి కీర్తి సురేశ్‌తో అంటే.. నేను నలుగుర్ని ప్రేమిస్తాను అని ఆమె కోపంతో సమాధానం ఇచ్చారు. పది తలలు ఉన్న రాక్షసరాజును అని విలన్‌ అంటే.. నాకు కావాల్సింది మూడు తలలు అన్నారు విక్రమ్‌. నేను పోలీసు కాదు.. పోకిరి అని చివర్లో వచ్చిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

ఈ సినిమాతో విక్రమ్‌ తిరిగి ఫాంలోకి వస్తారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. హరి మార్క్‌ స్పీడ్‌తో విక్రమ్‌ స్టైల్స్‌ తో రూపొందించిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు తదితరులు ఇతర పాత్రలలో నటించారు.