ఈ నెల 27న స్టార్‌ హీరో సినిమా విడుదల!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్, హరిలా హిట్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘సామి స్క్వేర్’. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘సామి’కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. పూర్తై చాలా రోజులైనా విడుదలకాకుండా ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను పక్కా చేసుకుంది.

ఈ నెల 27న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. తమిళ్‌లో ‘సామి 2’ పేరుతో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాను తెలుగులో ‘సామి’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. విక్రమ్‌ను మరోసారి పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో చూపించాడు దర్శకుడు హరి. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు తదితరులు ఇతర పాత్రలలో నటించారు.