‘సాండ్‌ కీ ఆంఖ్’ సినిమా పోస్టర్‌.. ‘వృద్ధాప్యం శరీరానికే.. మనసుకు కాదు’

క్రీడా నేపథ్యానికి చెందిన మరో ఆసక్తికరమైన బయోపిక్‌ బాలీవుడ్‌ నుంచి రాబోతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ‘వృద్ధాప్యం శరీరానికే.. మనసుకు కాదు’ అని పోస్టర్‌పై రాసున్న క్యాప్షన్‌ హైలైట్‌గా నిలిచింది.
తుషార్‌ హీరానందని సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మహిళా షూటర్లకు యూపీలో ‘షూటర్‌ దాదీస్‌’ గా మంచి పేరుంది. వీరి పాత్రల్లో తాప్సి, భూమీ పెడ్నేకర్‌ నటిస్తున్నారు.
ఈ షూటర్‌ దాదీస్‌ గురించి తెలుసుకోవడానికి తాప్సి, భూమి వారి స్వస్థలమైన బాగ్‌పట్‌ జిల్లాకు కూడా వెళ్లారు. కొన్ని రోజులు వారి ఇంట్లోనే ఉండి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు. అవన్నీ సినిమాకు ఉపయోగపడ్డాయని తాప్సి, భూమి తెలిపారు. సినిమా చిత్రీకరణ మొత్తం బాగ్‌పట్‌లోనే జరిగింది. దీపావళి సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.