మారుతితో సాయిధరం తేజ్..?

‘ఈరోజుల్లో’ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలే కాకుండా ‘భలేభలే మగాడివోయ్’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను కూడా తెరకెక్కించి సక్సెస్ లను అందుకున్నాడు దర్శకుడు మారుతి. అతడి ఆఖరి సినిమా ‘బాబు బంగారం’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన శర్వానంద్ హీరోగా ‘మహానుభావుడు’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆయన నిర్మాతగా మరో సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో మెగాఫ్యామిలీకు మారుతికి మధ్య మంచి సత్సంబందాలున్న సంగతి తెలిసిందే.
అల్లు శిరీష్ హీరోగా ఇప్పటికే ఒక సినిమా చేసిన మారుతి త్వరలోనే మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కెరీర్ ఆరంభంలో వరుస సక్సెస్ లను అందుకున్న ధరం తేజ్ ‘తిక్క’,’విన్నర్’ సినిమాల ఫ్లాపులతో డీలా పడ్డాడు. ప్రస్తుతం బివిఎస్ రవి దర్శకత్వంలో ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ కావడంతో తనకు ఈ సినిమా సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత తేజు, మారుతితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే కథ, కథనాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్ళడం ఖాయమని తెలుస్తోంది!