బన్నీ ట్వీట్‌.. అర్ధం అదేనా..!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న లెటేస్ట్‌ సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాకు సంబంధించి తాజా పోస్టర్‌ను.. ‘సమజవరగమన ఆన్‌ ద వే’ అంటూ బన్నీ ట్వీట్‌ చేశాడు. ఈ సినిమాలోని సామజవరగమన పాట లిరికల్‌ వీడియో ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లిరికల్‌ వీడియో యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో రికార్డు వ్యూస్‌ సాధించిన నేపథ్యంలో ‘సామజవరగమన’ సాంగ్‌ వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్టు హింట్‌ ఇస్తూ అర్జున్‌ ఈ ట్వీట్‌ చేసినట్టు కనిపిస్తోంది.

ఈ ట్వీట్‌లో మరో విశేషం కూడా ఉంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదల తేదీని ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి రేసులో భాగంగా జనవరి 12ను ఈ సినిమాను విడుదల చేస్తామని త్రివిక్రమ్‌ టీవ్‌ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అదేరోజున మహేష్ బాబు తన తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజున విడుదల చేస్తున్నట్టు పోటాపోటీగా ప్రకటించడంతో సంక్రాంత్రి బాక్సాఫీస్‌ రేసు వేడెక్కింది. ఒకే రోజు ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదలైతే మాత్రం అది ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుందని, లాంగ్‌రన్‌లోనూ వసూళ్లపైన ఎఫెక్ట్‌ పడుతుందని ఆందోళన వ్యక్తమైంది.

దీంతో ఈ సినిమాల విడుదల తేదీలపై నిర్మాతలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరూ చిత్రాలు వరుసగా జనవరి 11, 13 తేదీల్లో విడుదల చేసేలా నిర్మాతల మధ్య రాజీ ఒప్పందం కుదిరినట్టు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే బన్నీ ట్వీట్‌ చేసిన ‘అల వైకుంఠపురములో’ తాజా పోస్టర్‌లో విడుదల తేదీ కనిపించకపోవడం గమనార్హం. ఆల్రెడీ ఫిక్స్‌ అయిన రిలీజ్‌ డేట్‌ (జనవరి 12)పై నిర్మాతల మధ్య చర్చలు జరుగుతుండటంతోనే విడుదల తేదిను ఈ పోస్టర్‌పై ముద్రించలేదని తెలుస్తోంది. ఈ సినిమా మలయాళం డబ్బింగ్‌ వెర్షన్‌ పోస్టర్‌లో మాత్రం రిలీజ్‌ డేట్‌ జనవరి 12 అని ముద్రించారు. తెలుగు పోస్టర్‌లో రిలీజ్‌ డేట్‌ లేకపోవడంతో అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఒకేరోజు విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై ఆ రెండు సినిమాల చిత్రయూనిట్లు కార్లిటీ ఇవ్వాల్సి ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates