మీకు అలా అర్థమైందా? వైరల్‌ న్యూస్‌ పై క్లారీటి ఇచ్చిన సమంత


టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని పెళ్లి అయిన తరువాత హైదరాబాద్‌లో సెటిల్‌ అవడంతో పాటు తెలుగు చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు. ప్రస్తుతం కమర్శియల్‌ కథా చిత్రాలకంటే కథకు ప్రాథాన్యం ఉన్న చిత్రాల్లోనే నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. అలా నటించిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కోలీవుడ్‌లో సూపర్‌డీలక్స్‌ తరువాత మరో సినిమా నటించలేదు. త్వరలో ఒక క్రేజీ చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల సమంత తెలుగులో నటించిన తాజా చిత్రం ‘జాను’. ఇది తమిళంలో సంచలన విజయం సాధించిన ‘96’ చిత్రానికి రీమేక్‌.

కాగా జాను చిత్ర ప్రచారంలో భాగంగా సమంత మాట్లాడుతూ.. మరో రెండు మూడేళ్లలో నటనకు గుడ్‌బై చెబుతానని అన్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ ప్రచారం మితి మీరడంతో సమంత స్పందిస్తూ.. ‘ఓహో నేను చెప్పింది మీకు అలా అర్థం అయ్యిందా?’ అని ప్రశ్నించారు. నిజానికి తాను 3 ఏళ్ల తరువాత సినిమాకు గుడ్‌బై చెబుతానని చెప్పలేదన్నారు. పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్నానని సినిమా ప్రపంచం సవాల్‌తో కూడుకున్నదని అన్నట్టు చెప్పారు. ఇక్కడ నటీమణులు ఎక్కువ కాలం కొనసాగడం కష్టం అని చెప్పానన్నారు. అలా అవకాశాలు లేక తాను నటించలేకపోయినా, ఏదోవిధంగా సినిమాలోనే కొనసాగుతానని చెప్పానన్నారు. నటనకు కొంచెం గ్యాప్‌ రావచ్చునని, దీంతో సినిమాకు దూరం అవుతానని ఎవరూ భావించాల్సిన అవసరం లేదంటూ.. తన గురించి వైరల్‌ అవుతున్న అసత్య ప్రచారంపై సమంత క్లారిటీ ఇచ్చారు. స్నేహితులతో కలిసి పేద విద్యార్దుల కోసం ఒక పాఠశాలను కూడా సమంత కట్టిస్తున్నట్టు సమాచారం.