‘మీ టూ’కు నేనూ మద్దతిస్తాను: సమంత

గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో జరుగుతున్న ‘మీ టూ’ ఉద్యమానికి తానూ మద్దతు తెలుపుతానని అంటున్నారు ప్రముఖ నటి అక్కినేని సమంత. ఇటీవల బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా…నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ ఒకరికొకరు నోటీసులు ఇచ్చుకునేవరకూ వెళ్లింది. వీరిద్దరి కేసు ఓ కొలిక్కి రాకముందే రోజుకొకరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బట్టబయలు చేస్తూ వస్తున్నారు.

ఇటీవల ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. చిన్మయి, సమంత చాలా కాలంగా మంచి స్నేహితులు. దాంతో వేధింపులను ఎదుర్కొన్న ఆడవాళ్లకు తాను మద్దతుగా నిలుస్తానంటూ సమంత ముందుకొచ్చారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘చాలా మంది మహిళలు ధైర్యం తెచ్చుకుని తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి బయటపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మీ ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఈ విషయంలో కొందరు వ్యక్తులు, మహిళలు మిమ్మల్ని నిలదీస్తూ, ప్రశ్నిస్తున్నందుకు సారీ. మీరు నోరు తెరిచి మాట్లాడటం వల్ల చెప్పుకోలేని చిన్న పిల్లలను మీరు కాపాడినవారవుతారు. అందుకు ధన్యవాదాలు. ‘metooindiamovement’ కు నేను మద్దతు తెలుపుతున్నాను’ అని వెల్లడించారు సమంత.