జిమ్‌లో సానియా.. నెటిజన్ల ప్రశంసలు.. వైరల్‌ ఫొటో

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె ఈ ఏడాది అక్టోబర్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. గర్భిణి కావడంతో కొన్ని నెలలపాటు ఫిట్‌నెస్‌కు, వర్కవుట్లకు దూరంగా ఉన్న సానియా ప్రస్తుతం జిమ్‌ బాట పట్టింది. గర్భధారణ సమయంలో వచ్చిన కాలరీలన్నింటినీ తగ్గించుకునే పనిలో ఉంది. జిమ్‌లో ఉన్నప్పటి ఫొటోను సానియా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ‘పూర్వపు ఫిట్‌నెస్‌ను సాధించడం ఆలస్యం కావచ్చు. కానీ సాధించడం మాత్రం కచ్చితం’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈఫొటో వైరల్‌ అవుతోంది. సానియాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చి ఎక్కువ రోజులు కాకముందే ఆమె జిమ్‌లో కసరత్తులు చేయడంపై నెటిజన్లు సానియాను అభినందిస్తున్నారు. ‘త్వరలోనే సానియా వివిధ టోర్నీలో పాల్గొనబోతుందేమో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

దీంతో పాటు ఆమె ముద్దుల కొడుకు ఇజాన్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ‘ఇజాన్‌ను ఇంట్లో వదిలి బయటికి వెళ్లడం చాలా కష్టంగా అనిపిస్తోంది. పనిలో ఉన్నంత సేపు ఎంతో సంక్లిష్టంగా నడిచింది.’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చి ఫొటోను షేర్‌ చేసింది.కొంత కాలంపాటు టెన్నిస్‌నుంచి సానియా తాత్కాలిక విరామం తీసుకుంది. వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమంటూ ఇది వరకు సానియా ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. 2020 ఒలింపిక్స్‌ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.