సైన్స్ ఫిక్షన్ సినిమాలో వరుణ్ తేజ్!

‘ఘాజీ’ చిత్రంతో దర్శకుడిగా మంచి ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్ రెడ్డి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ఈ యంగ్ డైరెక్టర్ మరో కొత్త సినిమా మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా రొటీన్ కు భిన్నంగా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో సాగే కథ అని సమాచారం. ఈ సినిమాకు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ అవసరం కావడంతో ప్రస్తుతం సంకల్ప్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఓ పెద్ద నిర్మాత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ కథకు వరుణ్ తేజ్ అయితే సెట్ అవుతారని భావించిన సంకల్ప్ ఈ మేరకు వరుణ్ తో సంప్రదింపులు జరిపి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత వెంకీ అట్లూరితో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఇక తాజాగా సంకల్ప్ సినిమా కూడా లైన్ లో పెట్టాడు.