కరీనాను ఎలా పిలవాలో తెలియదు: సారా

ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘కాఫీ విత్‌ కరణ్‌’కు నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌‌, నటి సారా అలీ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సారా తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. ‌.. కరీనా కపూర్‌ రెండో అమ్మని తన తండ్రి సైఫ్‌ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. సారా తొమ్మిదేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు సైఫ్‌, అమృత సింగ్‌ విడిపోయారు. ఆ తర్వాత సైఫ్‌ నటి కరీనాను రెండో వివాహం చేసుకున్నారు.

నాతోటి వారితో నేను చాలా సూటిగా మాట్లాడుతుంటా. ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉంటాను. చూడు.. నీకు గొప్ప తల్లి ఉంది. మనమంతా స్నేహపూర్వకంగా ఉండాలి అనేదే నా కోరిక అని కరీనానే స్వయంగా నాతో అన్నారు. ఆమె నీ రెండో అమ్మ అని మా నాన్న (సైఫ్‌) ఏరోజూ నాకు చెప్పలేదు. అది వినడానికి కాస్త అసౌకర్యంగానూ ఉంటుంది అని సారా పేర్కొన్నారు.

కరీనాను ‘పిన్ని’ అని ఎప్పుడూ పిలవలేదా? అని కరణ్‌ ప్రశ్నించగా.. ‘నేను పిన్ని అని పిలిస్తే కరీనా తట్టుకోలేరు.. వద్దు, వద్దు అంటారు (నవ్వుతూ). ఆమెను ఎలా పిలవాలో నాకే అర్థం కాదు. ఆంటీ అంటే మా నాన్న ఒప్పుకోరు (మళ్లీ నవ్వుతూ)’ అని సారా సమాధానం ఇచ్చారు.

‘ఇతరుల భావాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం చాలా ముఖ్యం. మా అమ్మ, నాన్నను చూస్తున్నప్పుడు వాళ్లిద్దరూ కలిసి ఉంటే ఇంకా సంతోషంగా ఉండేవారు కదా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నా చుట్టూ ఉన్న వ్యక్తులు సంతోషంగా ఉన్నారు. కొన్ని విషయాల్ని స్వాగతించక తప్పదు. ఇవాళ నాకు రెండు ఇళ్లు ఉన్నాయి’ అంటూ సారా తన మనసులోని మాట చెప్పుకొచ్చారు. ఆమె ‘కేదార్‌నాథ్‌’ చిత్రంతో నటిగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.