HomeTelugu Newsబెంగళూరులో ఓ యువతిపై దేశద్రోహం కేసు

బెంగళూరులో ఓ యువతిపై దేశద్రోహం కేసు

10 18
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన సభలో ఓ యువతి పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. పాక్‌కు అనుకూల నినాదాలు చేసినందుకు గానూ అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. యువతి ప్రవర్తించిన తీరుపై ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కూతురుని జైల్లో పెట్టినా తప్పులేదని, ఆమె కోసం తాను ఎలాంటి న్యాయపోరాటం చేయబోనని యువతి తండ్రి స్పష్టంగా చెప్పారు. అమూల్య వ్యాఖ్యలు టీవీలో, సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె తండ్రిని సంప్రదించగా ఆయన తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఇలా మాట్లాడొద్దని చాలా సార్లు చెప్పినా అమూల్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఆమెను జైల్లో పెట్టినా.. పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తన వల్ల నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె కోసం నేను న్యాయపోరాటం కూడా చేయను’ అని యువతి తండ్రి చెప్పుకొచ్చారు.

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీకి వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన సభకు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ హాజరయ్యారు. అయితే ఒవైసీ ప్రసంగం తర్వాత 19 ఏళ్ల అమూల్య లియోన్‌ ఒక్కసారిగా వేదికపైకి ఎక్కి పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసింది. దీంతో షాక్‌కు గురైన ఒవైసీ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి మైక్‌ను లాక్కొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ యువతి వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లిపోయారు. అమూల్య నినాదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu