తమిళ డైరెక్టర్‌తో షారుక్‌ ఖాన్‌!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తమిళ డైరెక్టర్‌ అట్లీతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, కొల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. తర్వాత అట్లీ ఆఫీసుకు షారుక్‌ వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్‌కు అట్లీను తీసుకెళ్లాలని బాద్‌షా ప్రయత్నిస్తున్నారట.

అట్లీ తెరకెక్కించిన తమిళ సినిమా ‘మెర్సల్‌’ హిందీ రీమేక్‌లో షారుక్‌ నటించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాదు విజయ్‌ హీరోగా అట్లీ ప్రస్తుతం తీస్తున్న సినిమాలో షారుక్‌ అతిథి పాత్రలో నటించనున్నారని కూడా ప్రచారం జరిగింది. దీనికి తోడు అట్లీ ఇటీవల షారుక్‌ను ట్విటర్‌ ఫాలో అవడం మొదలు పెట్టారు. మరి ఈ వదంతుల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

షారుక్‌ తమిళ సినిమాలో నటించడం ఇది తొలిసారి కాదు. కమల్‌ హాసన్‌ ‘హే రామ్‌’ సినిమాలో షారుక్‌ ఆయన సోదరుడి పాత్రను పోషించారు. దక్షిణాదిలో జరిగే పలు వేడుకలకు షారుక్‌ హాజరౌతుంటారు. ఆయనకు కోలీవుడ్‌, టాలీవుడ్‌లో స్నేహితులు ఉన్నారు. దర్శకుడిగా అట్లీ విజయవంతంగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన తీసిన మూడు సినిమాలు ‘రాజా రాణి’, ‘తెరి’, ‘మెర్సల్‌’ సినిమాలు హిట్‌ అయ్యాయి.

CLICK HERE!! For the aha Latest Updates