అమితాబ్‌-షారుక్‌ ఖాన్‌ మధ్య వివాదం.. పరిష్కరించిన తాప్సీ

బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్, షారుక్‌ ఖాన్‌ల మధ్య వివాదానికి హీరోయిన్ తాప్సీ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. అమితాబ్‌, తాప్సి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బద్లా’ మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకుంది. సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై షారుక్‌ ఖాన్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే సినిమా ఇంత విజయం సాధించినప్పటికీ చిత్ర నిర్మాత కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవ్వరూ ‘బద్లా’ విజయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోవడంలేదని కొన్ని రోజుల క్రితం అమితాబ్‌ బాధపడుతూ ట్వీట్‌ చేశారు.

దాంతో షారుక్‌ స్పందిస్తూ.. ‘సర్‌.. మీరు పార్టీ ఎప్పుడిస్తారా అని రాత్రంతా మీ ఇంటి ముందే వేచి చూస్తున్నాం’ అంటూ అమితాబ్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇందుకు బిగ్‌బి ప్రతిస్పందిస్తూ.. ‘ఇప్పుడు పార్టీ కూడా నేనే ఇవ్వాలా?’ అని చమత్కరించారు. దాంతో ఈ విషయంపై తాజాగా తాప్సి స్పందించారు. ‘ముంబయి వచ్చాక నేనే పార్టీ ఇస్తాను. ఇకనైనా వాదులాడుకోవడం ఆపండి. పార్టీకి అందర్నీ ఆహ్వానిస్తాను’ అని మీడియా ద్వారా వెల్లడించింది తాప్సీ.