నా మనసంతా ఎక్కడ ఉందో అక్కడికే బయలుదేరాను: సోనాలీ

బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం కొన్ని నెలల క్రితం న్యూయార్క్‌ వెళ్లిన ఆమె.. ఇన్నాళ్లూ అక్కడే వైద్యం తీసుకున్నారు. ధైర్యంగా క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. కాగా ముంబయికి తిరిగి వస్తున్నానని సోనాలి తాజాగా పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ చేశారు.

‘దూరం ప్రేమను పెంచుతుంది’ అంటారు. నిజమే.. కానీ అది మీకు నేర్పిన పాఠాన్ని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. ఇంటికి దూరంగా న్యూయార్క్‌లో ఉన్నప్పుడు నేను చాలా కథలు చదివా. ఒక్కొక్కరు వారి కథను వివిధ రకాలుగా వర్ణించారు. ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడ్డారు. కానీ లక్ష్యాన్ని మాత్రం వదిలేయలేదు’.

‘ఇప్పుడు నేను.. నా మనసంతా ఎక్కడ ఉందో (ఇల్లు) అక్కడికి బయలుదేరా. ఈ భావనను నేను మాటల్లో వర్ణించలేకపోతున్నా, కానీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. నా కుటుంబాన్ని, స్నేహితుల్ని మళ్లీ చూస్తున్నాను అనే ఆనందంలో ఉన్నా. ఇంకా నా పోరాటం పూర్తి కాలేదు (క్యాన్సర్‌పై).. కానీ ఇలా చిన్న విరామం తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ సోనాలి తన ఫొటోల్ని షేర్‌ చేశారు.