విశాల్‌పై వరలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు .. రుషిలా నటించొద్దు.. నీ తీరు బాగా తెలుసు

2019 నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విశాల్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019-2022 ఏడాదికి గానూ ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విశాల్‌ పాండవర్‌ జట్టు, కే.భాగ్యరాజ్‌ స్వామి శంకరదాస్‌ జట్టు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తండ్రి శరత్‌ కుమార్‌పై విశాల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని నటి వరలక్ష్మి సోషల్‌మీడియాలో మండిపడ్డారు. ఈ మేరకు ‘విశాల్‌.. నువ్వు నా ఓటును కోల్పోయావు’ అంటూ ఓ పోస్ట్‌ చేశారు.

‘నీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియోను చూశా. ఇంత దిగజారుతావని అనుకోలేదు. నీ వ్యాఖ్యలు విని షాక్‌ అయ్యా, ఎంతో బాధపడ్డా. నీపై నాకున్న కాస్త గౌరవం కూడా పోయింది. నా తండ్రి (శరత్‌ కుమార్‌) గతం గురించి, ఆయనపై ఉన్న భూవివాదం కేసు గురించి ఆరోపణలు చేయడం విచారకరం. కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు ఎవరూ దోషులు కారు. దోషి అని తేలిన తర్వాతే శిక్ష పడుతుంది. నువ్వు కాస్త హుందాగా ప్రవర్తించు. ఇలాంటి నీచమైన వీడియోలు నీ దిగజారుడు స్వభావాన్ని తెలుపుతున్నాయి. దానికి నువ్వు పెరిగిన విధానమే కారణం అనుకుంటా’.

‘ఇకపైనైనా రుషిలా నటించొద్దు. మాకు నీ రెండు నాలుకల ధోరణి, నువ్వు అబద్ధాలు చెప్పే తీరు బాగా తెలుసు. నువ్వు నిజంగా రుషిలాంటి వాడివైతే నీ సొంత జట్టు పాండవర్‌ నిన్ను తప్పుపట్టదు. నువ్వు ఇప్పటి వరకు గొప్ప పనులు, గర్వంగా ఫీల్‌ అయ్యే పనులు చేసుంటే వాటిని ప్రజలకు చూపించు, ప్రచారంలో వాటి గురించి మాట్లాడు. అంతేకానీ మా నాన్నను అవమానిస్తూ ఎందుకు వ్యాఖ్యలు చేస్తావు. ఇన్నాళ్లు నేను నిన్ను గౌరవించాను, ఓ స్నేహితుడిలా భావించాను. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు హద్దులు మీరి ప్రవర్తించావు. పోనీలే.. కనీసం తెరవెనుకనైనా నువ్వు మంచి నటుడివి.. ఎప్పుడూ నువ్వు చెబుతుంటావు కదా.. సత్యం గెలుస్తుందని.. అదే జరుగుతుందని ఆశిస్తున్నా’ అని వరలక్ష్మి ఓ ప్రకటన విడుదల చేశారు.

విశాల్‌, వరలక్ష్మి మధ్య ప్రేమ ఉందని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. వీరిద్దరు వివాహం కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అయితే మేం కేవలం స్నేహితులమేనని వరలక్ష్మి తేల్చి చెప్పారు. తర్వాత విశాల్‌కు టాలీవుడ్‌ నటి అనీశాతో నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీరి వివాహం జరగనుంది.