మారువేషంలో థియేటర్ల చుట్టూ తిరుగుతున్న సుధీర్‌బాబు..!

సినిమా ప్రమోషన్‌ కోసం టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు మారువేషాల్లో తిరుగుతున్నాడు. తన సొంత బ్యానర్‌లో నటించి, నిర్మించిన నన్ను దోచుకుందువటే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎవరూ గుర్తుపట్టకుండా మారు వేషాల్లో సినిమా థియేటర్‌కు వెళ్తున్నాడు. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ మారు వేషాలు వేసుకొని థియేటర్స్ కి వెళ్లి ప్రేక్షకుల మధ్యన కూర్చొని వాళ్లు సినిమా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకునేవారు. ఇప్పుడు దీనిని టాలీవుడ్ లో సుధీర్ బాబు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నది.

సుధీర్ బాబు సొంత బ్యానర్‌లో నటిస్తూ నిర్మించిన “నన్ను దోచుకుందువటే” సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా టాక్ బాగుందిలే అని ఊరుకోకుండా మారు వేషాల్లో ఎవరూ గుర్తు పట్టకుండా థియేటర్స్ కు వెళ్లి ప్రేక్షకుల మధ్యన కూర్చొని సినిమా చూస్తూ సినిమా గురించి ప్రేక్షకుల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నాడట. ఎవరైన గుర్తు పడితే.. వారితో సెల్ఫీలు దిగుతూ హైదరాబాద్ లోని థియేటర్స్ అన్ని కవర్ చేస్తున్నాడు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ఈ విధంగా పర్యటించి ప్రేక్షకుల మనోగతాలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఎప్పుడు ఎక్కడ ఏ థియేటర్ కు వేళ్తాడో ఎవరికీ తెలియదట. టాలీవుడ్‌లో ఇదో కొత్త పరిణామమనే చెప్పాలి.