పవన్‌ ప్రత్యేక హోదా గురించి మరిచిపోయారు: సుమన్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పూర్తి మద్దతు టీఆర్‌ఎస్‌కే ఇస్తున్నట్లు ప్రముఖ నటుడు సుమన్‌ తెలిపారు. విశాఖ నగరంలో కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కేసీఆర్‌ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తన మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందని.. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆరే రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రత్యేక హోదా గురించి మరిచిపోయారని సుమన్‌ వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజాదరణ ఉన్న పవన్‌ కల్యాణ్ హోదా కోసం గట్టిగా పోరాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆయన ఆందోళన చేపట్టాలని కోరారు.