రానాను డ్రగ్స్ తో సంబంధం లేదు: సురేష్ బాబు

ప్రస్తుతం టాలీవుడ్ లో మత్తుపదార్ధాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పన్నెండు మంది పేర్లు బయటకు రాగా, తమకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని మీడియా ముఖంగా కొందరు తారలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని దయచేసి ఈ వివాదంలోకి లాగొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారి అకున్ మాత్రం ఎనిమిది మంది సినీ ప్రముఖులకు మాత్రమే నోటీసులు అందజేశామని, సామాజిక మాధ్యమాల్లో వినపడుతున్న వారి పేర్లకు మాకు ఎలాంటి సంబంధం లేదని వ్యక్తం చేశారు. నోటీసులు అందుకున్న వారిని త్వరలోనే విచరిస్తామని వెల్లడించారు. అయితే మీడియాలో వినిపించే పేర్లలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇద్దరు కుమారులు రానా, అభిరామ్ ల పేర్లు కూడా ఉన్నాయి. 
ఈ విషయంపై స్పందించిన సురేష్ బాబు.. ”కావాలనే కొందరు రానా, అభిరామ్ లను ఈ వివాదంలోకి లాగుతున్నారని అన్నారు. మాకు ఎలాంటి నోటీసులు అందలేదని, ఎవరి దగ్గర నుండి ఫోన్లు కూడా రాలేదని స్పష్టం చేశారు. మా కుటుంబంలో ఏ ఒక్కరికీ కూడా ఈ వివాదంతో సంబంధం లేదని వెల్లడించిన సురేష్ బాబు, ఇండస్ట్రీలో డ్రగ్స్ కు అలవాటు పడిన ఆ పది మంది ఎవరో తనకు తెలియదని అన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ వారి పేర్లను రహస్యంగా ఉంచారని పేర్కొన్నారు”. ఇది ఇలా ఉంటే, ఇండస్ట్రీకు చెందిన ప్రముఖుల పేర్లు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారి పేర్లను బయటపెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి.