బన్నీ సినిమాలో మరో హీరో.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాలో హీరో సుశాంత్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మూవీ యూనిట్‌ ఆదివారం విడుదల చేసింది. సుశాంత్‌ ‘రాజ్‌’ అనే పాత్రను పోషిస్తున్నట్లు తెలిపింది. ‘ఇతని అందమైన చిరునవ్వు ఎవరినైనా ఆకర్షిస్తుంది’ అని ఈ ఫొటోకు చిత్ర బృందం క్యాప్షన్‌ ఇచ్చింది. ‘అల వైకుంఠపురములో’ కుటుంబం నుంచి రాజ్‌ను పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌. నివేదా పేతురాజ్‌, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత తెలుగులో టబు నటిస్తున్న సినిమా ఇది కావడం విశేషం. గీతా ఆర్ట్స్‌ సంస్థ, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులోని ప్రత్యేక గీతంలో కాజల్‌ ఆడిపాడనున్నారట. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పాటకు మంచి స్పందన లభిస్తోంది.

చిందేసిన అల్లు అర్జున్‌:

‘అల..వైకుంఠపురములో..’సినిమా నుంచి అల్లు అర్జున్‌ కొత్త పోస్టర్‌ను ఆదివారం సాయంత్రం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్లకు కొంచెం భిన్నంగా ఈ పోస్టర్‌ ఉంది. ఇందులో బన్నీ డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. ఈ సినిమాలోని ‘రాములో రాములా..’ అనే పాట టీజర్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.